Monday, November 14, 2005

డైరీ

కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టు , కొత్త బ్లాగర్ గా రెండో రోజే ఇంకో పోష్టు చేస్తున్నా.
నాకు చిన్నప్పటి నుండి డైరీ రాయాలనే బలే కోరిక ఉండేది. 10th లో ఉన్నప్పుడు రాయడానికి ప్రయత్నించా. దాన్ని డైరీ అనే కంటే లాగ్ బుక్ అనడం బెటర్ ఏమో... ఈరోజు 9 గంటలకే నిద్ర లేచా...7 గంటలకు సినిమా చూసా...ఇలా ఉండేవి నా ఎంట్రీలు......అవి ఇప్పుడు చదివితే నాకే నవ్వొస్తాది...ఇప్పుడు డైరీ రాయాలంటే ఓపిక లేదు. అంతకు మించి నన్నే ఇబ్బంది పెట్టే నిజాలు రాసే ధైర్యం కూడా లేదు..డెరీ లో కూడా ఆత్మవంచన చేసుకోవాల్సివస్తుందేమో అని భయం.

డైరీ అంటే నామిత్రుడు రాజ్ (కలం పేరు సలీం ) తెలుగు పీపుల్.కాం లో ఒక అందమయిన కవిత రాసాడు. కవిత్వం ఒక అనుభూతి ని పంచితే ఎలా ఉంటుందో ఈ కవిత చదివితే తెలుస్తుంది.
డైరీ

ఎప్పుడో ఎక్కడో పోగొట్టుకున్న 'నన్ను' ని
ఈ కాగితాల్లోనే రోజూ వెతుకుతూ ఉంటాను
అనంతాలలో పారేసుకున్న అనుభూతుల వెచ్చదనాన్ని
ఈ కాగితాల్లోనే దాచుకుని నిత్యం తడుముతూ వుంటాను

ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు
ఎన్నోఆదర్శాల ఆవేశాలు
ఈ కాగితాల్లోనే రెప రెపలాడాయి

ఎన్నో కలలు కన్నీరై
ఎన్నో ప్రేమలు స్మృతిగీతాలై
ఈ కాగితాల్లోనే ఇంకుచుక్కలై ఇంకిపోయాయి

రాయాలని రాయలేక
రాయకుండా వుండలేక
పుటపుటకి ఎన్నోపురిటి నెప్పులు
ఈకాగితాల్లోనే పూర్తికాకుండా నిలిచిపోయాయి

కలకాలం నిలువలేక
కలిసి నాతో రాలేక
కదిలిపోయిన వసంతాలెన్నో
ఈ కాగితాల్లోనే పూలరెక్కలయి మిగిలి పోయాయి

నేటి 'నేడు' ని రేపటి 'నాడు' గా రాసుకోడానికి
ఈ కాగితాల్ని రొజు సవరిస్తూవుంటాను
ఎప్పుడో ఎక్కడో పోగొట్టుకున్న 'నన్ను' ని
ఈ కాగితాల్లోనే రోజూ వెతుకుతూ ఉంటాను.

ఒరిజినల్ పోష్టు, కామెంట్స్ చూడాలనుకుంటే ఈ లింక్ చూడండి.
http://www.telugupeople.com/discussion/article.asp?id=13074

No comments: